Home  »  Featured Articles  »  ఎన్టీఆర్‌తో 15 సార్లు పోటీ పడిన కృష్ణ‌.. ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి?

Updated : Apr 6, 2026

ఎన్టీఆర్, ఎఎన్నార్ తర్వాత మూడో స్థానంలో నిలబడిన హీరో కృష్ణ‌. స్వతహాగా ఎన్టీఆర్ అభిమాని అయిన కృష్ణ‌.. ఎఎన్నార్‌కి ఉన్న పాపులారిటీని ప్రత్యక్షంగా చూసిన తర్వాత తను కూడా హీరో అవ్వాలనుకున్నారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమయ్యారు కృష్ణ‌. తన అభిమాన హీరో ఎన్టీఆర్‌తో కలిసి నటించాలనేది ఆయన చిరకాల కోరిక. స్త్రీజన్మ చిత్రంతో ఆయన కోరిక నెరవేరింది. ఆ సినిమాలో ఎన్టీఆర్‌కు తమ్ముడిగా నటించారు కృష్ణ‌. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి 6 సినిమాల్లో నటించారు. విశేషం ఏమిటంటే.. ఆ ఆరు సినిమాల్లోనూ ఎన్టీఆర్‌కి తమ్ముడిగానే నటించారు కృష్ణ‌. వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉండేది. అయితే సినిమాల పరంగా మాత్రం ఇద్దరి మధ్య పోటీ బాగా నడిచేది. 15 సార్లు వీరి సినిమాలు ఒకేసారి రిలీజ్ అయి పోటీ పడ్డాయి. వాటిలో కొన్నిసార్లు ఎన్టీఆర్ విజయం సాధించగా, కొన్ని సార్లు కృష్ణ‌విజయాల్ని అందుకున్నారు. వాటిలో రెండు సినిమాల విషయంలో మాత్రం వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. 

1977 సంక్రాంతికి ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన దానవీరశూర కర్ణ, కృష్ణ‌హీరోగా నటిస్తూ నిర్మించిన ‘కురుక్షేత్రం’ విడుదలయ్యాయి. ఈ సినిమాలు నిర్మాణంలో ఉండగానే రెండూ మహాభారతం నేపథ్యంలో చేసిన కథలని ఎన్టీఆర్‌కి తెలిసింది. వెంటనే కృష్ణ‌కు కబురు పంపారు. ఆయన వచ్చిన తర్వాత ‘బ్రదర్ మేం దానవీరశూరకర్ణ సినిమా చేస్తున్నాం. మీరు కూడా మహాభారత కథనే తెరకెక్కిస్తున్నారని తెలిసింది. దాని వల్ల ఇద్దరం ఇబ్బంది పడతాం. కాబట్టి మీ సినిమాను ఆపెయ్యండి’ అన్నారు ఎన్టీఆర్. దానికి కృష్ణ‌సమాధానమిస్తూ.. ‘మేం ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే 10 లక్షలు ఖర్చుపెట్టాం. ఇప్ప్పుడు వెనక్కి తగ్గలేం’ అని చెప్పి వచ్చేశారు కృష్ణ‌. అంతకుముందు అల్లూరి సీతారామరాజు చేస్తున్న సమయంలో కూడా కృష్ణ‌ను పిలిచి ఆ సినిమా తియ్యొద్దు అన్నారు ఎన్టీఆర్. కానీ, కృష్ణ పట్టుదలగా ఆ సినిమాను పూర్తి చేసి ఘనవిజయాన్ని, మంచి పేరుని సంపాదించుకున్నారు. ఇక దానవీరశూరకర్ణ, కురుక్షేత్రం 1977 జనవరి 14న విడుదలయ్యాయి. దానవీరశూరకర్ణ ఘనవిజయం సాధించి కాసుల వర్షం కురిపించగా, కురుక్షేత్రం చిత్రానికి పరాజయం తప్పలేదు. 

ఎన్టీఆర్ నటించిన తొలి జానపద చిత్రం పాతాళభైరవి ఎవరూ ఊహించని విధంగా ఘనవిజయం సాధించి ఆయన్ని తిరుగులేని మాస్ హీరోగా నిలబెట్టింది. ఆ తర్వాత ఎన్నో పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాల్లో నటించారు ఎన్టీఆర్. ఆయన నటించిన చివరి జానపద చిత్రం సింహబలుడు. ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. 50 ఏళ్ళ కెరీర్‌లో ఆయన డైరెక్ట్ చేసిన ఒకే ఒక్క జానపద చిత్రమది. ఈ సినిమా చేస్తున్న‌సమయంలోనే కృష్ణ‌, గిరిబాబు హీరోలుగా సింహగర్జన సినిమాను ప్రారంభించారు. ఈ సినిమాకి గిరిబాబు నిర్మాత. తనకు పోటీగా దాదాపు అదే టైటిల్‌తో కృష్ణ సినిమా చేస్తున్నారనే విషయాన్ని ఎన్టీఆర్‌కు చేరవేశారు ఆయన సన్నిహితులు. అయినా ఎన్టీఆర్ ఈ విషయంలో స్పందించలేదు. గిరిబాబుకి ఈ విషయం తెలిసి ఎన్టీఆర్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు. 

ఒకరోజు ఉదయమే ఎన్టీఆర్ ఆఫీస్‌కి వెళ్లారు గిరిబాబు. ఆయన్ని సాదరంగా ఆహ్వానించారు ఎన్టీఆర్. కుశల ప్రశ్నల తర్వాత ‘నేను చేస్తున్న సింహగర్జన, మీరు చేస్తున్న సింహబలుడు ఒకే కథతో రూపొందుతున్నాయని అందరూ చెప్ప్పుకుంటున్నారు. ఈ విషయం మీ వరకు వచ్చిందని తెలిసింది. అందుకే మీరు నాకు సమయం ఇస్తే మా సినిమా కథ చెబుతాను’ అన్నారు గిరిబాబు. ఆ సినిమా సినాప్సిస్ చెప్పారు గిరిబాబు. ఓపికగా అంతా విన్న ఎన్టీఆర్.. ‘ఈ రెండు కథలు వేరు కదా. మరి నాకు అలా చెప్తున్నారేంటి?’ అని ఆశ్చర్యపోయారు ఎన్టీఆర్. విషయం అర్థం చేసుకొని గిరిబాబును అభినందించి ‘సినిమా బాగా తియ్యండి బ్రదర్.. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వొద్దు’ అని చెప్పారు ఎన్టీఆర్. ఈ రెండు సినిమాలనూ భారీ బడ్జెట్‌తోనే నిర్మించారు. సింహబలుడు విడుదలైన 15 రోజుల తర్వాత సింహగర్జన రిలీజ్ అయింది. ఈ రెండింటిలో సింహగర్జన విజయం సాధించగా, సింహబలుడు పరాజయాన్ని చవిచూసింది.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.